Sunday 30 December 2012

పిసినారి మరణం

చిన్నారి డెస్కు బెలగాం భీమేశ్వరరావు   Sun, 8 Aug 2010, IST
బొండపల్లి గ్రామంలో నారంనాయుడనే రైతుండేవాడు. అతడు పరమలోభి. ఆరుగాలం పొలంలో కష్టపడేవాడు. పండించిన పంటలు పట్నం తీసుకుపోయి అక్కడ వర్తకులకు ఇచ్చేవాడు. వాళ్ళిచ్చే డబ్బు ఇంటికి తీసుకువెళ్తే ఖర్చు కాగలదని వాళ్ళ వద్దే దాచుకొనేవాడు. దాచిన డబ్బుకి, వాడినడబ్బుకి నోటిలెక్కే కానీ రాతా కోతా ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళకన్నా బయటివాళ్ళ మీదే అతనికి నమ్మకం ఎక్కువ. పట్నంలో పని ఆలస్యమయినపుడు కూడా మజ్జిగ నీళ్ళయినా కొనుక్కొని తాగేవాడుకాడు. వర్తకులింటి వద్దే కడుపు నిండా నీళ్ళు తాగేసి ఇంటికి బయలుదేరుతుండే వాడు. నారంనాయుడి పిసినారితనాన్ని చెప్పుకుని వర్తకులు వెనక నవ్వుకొంటుండేవారు.ఒకరోజు నారంనాయుడు జనపనార కట్టలను బండికెక్కించి పట్నం బయలుదేరుతున్నప్పుడు వాళ్ళావిడ, 'ఈసారి డబ్బు షావుకారి వద్ద కుదేయకు. సంక్రాంతి వస్తోంది. అందరికీ కొత్తబట్టలు కొనుక్కురా! పెళ్ళీడు వచ్చిన ఆడపిల్లలున్నారు. నాలుగుచీరలు తీసుకురా' అని చెప్పింది.

ఇల్లాలి మాటలు చెవినపడేసరికి నారంనాయుడికి ఒళ్ళు మండిపోయింది. ఇల్లాలి వంక కరుకుగా చూస్తూ 'మొన్న దసరాకి బట్టలు తీశానుగా. అవి చాలు!' మాట పొడిగించకుండా చరచర బండిని తోలుకుపోయాడు. ఆ చిరాకులో ఆ రోజు తీసికెళ్లాల్సిన చద్దిమూట మరచిపోయాడు. నారంనాయుడి భార్య భర్త నిర్వాకానికి విస్తూపోతూ.. 'ఏం మనిషో ఏమిటో! పొలం రాబడంతా ఎంత పోగుచేసుకుంటాడో ఏమో! ఒక్క రూపాయి కూడా కంట పడనివ్వడు!' అంటూ నోరు నొక్కుకుంది!ఆ రోజు నారంనాయుడు ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. భార్య ఖర్చు చూపేసరికే అతడి మనస్సు గాయపడింది. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదేమో బాగా అలసిపోయాడు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కాళ్ళు తేలిపోతున్నాయి. ప్రాణం విలవిల్లాడిపోతూండగా భార్యను కేకేసి, 'కూడింత తొందరగా పెట్టవే. ఆకలి దంచేస్తుంది!' అని అన్నాడు. భర్త వాలకం చూసి ఆమె గబగబా వంటింట్లోకి వెళ్ళింది. గంజన్నం తెచ్చి భర్త ముందు పెట్టాలని ఆమె చూచేసరికి భర్త నేలమీద పడున్నాడు. గాబరాపడుతూ ఆమె భర్తను తట్టిలేపడానికి ప్రయత్నించింది. ఉలుకూ లేదు. పలుకూ లేదు. అప్పటికీ అతడి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. భార్య గొల్లుమంది. ఇరుగుపొరుగు వాళ్ళు పరుగున వచ్చారు. ఇంట్లో పడున్న నారంనాయుడి శవాన్ని ఇంటి బయటకు తెచ్చారు. ఏడుపులు పూర్తయ్యాయి. జరగవలసిన తంతు జరగాల్సి ఉంది.

అప్పుడు నారంనాయుడి భార్య అక్కడున్న బంధువుల వంక చూసి ''ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు! అంతా పట్నంలోని వర్తకుల వద్దే కుదేసుకున్నాడు!'' అని బోరున ఏడుస్తూ చెప్పింది. బంధువులు వెంటనే పట్నం వెళ్ళారు. వర్తకులను కలిసి విషయం చెప్పారు. నారంనాయుడు దాచుకుంటున్న డబ్బు గురించి అడిగారు. వర్తకులు ''అబ్బే! మా వద్ద నారం నాయుడు డబ్బునెపుడు ఉంచేవాడు కాదు. ఎప్పటిదప్పుడే పట్టుకుపోతుండేవాడు!'' అంటూ మాటమార్చారు.మర్నాడు నారంనాయుడి శవదహన కార్యక్రమానికి ఊళ్ళో వాళ్ళు చందాలేసుకొని కార్యక్రమం ముగించారు.

బెలగాం భీమేశ్వరరావు

No comments:

Post a Comment