Thursday 13 December 2012

తోడు

కిరణ్మయికి ఐదేళ్ళు. ఫస్ట్‌ స్టాండర్డ్‌ చదువుతుంది. పార్వతీపురంలో ఉన్నప్పుడు చాలా చురుకుగానే ఉండేది. ఇంట్లో బిజీ.. స్కూల్లో బిజీ.. అయినా నాన్నమ్మ ఒడిలో చేరి కథలు చెప్పించుకునేది. తాతగారి కాళ్ళమీద ఊగుతూ కబుర్లు చెప్పించుకునేది. బాబాయి వద్దకు వెళ్ళి అదేమిటి, ఇదేమిటి అని రకరకాల ప్రశ్నలు సంధించేది. నాన్నమ్మ దగ్గితే దగ్గు సిరప్‌ ఇచ్చేది. తాతకి భోజనం కాగానే మందులు అందించేది. సెలవురోజు వచ్చిందంటే ఇరుగుపొరుగు పిల్లలతో రకరకాల ఆటలు ఆడుకునేది. పచ్చిక మీద దొర్లేది. బంకమన్నుతో బొమ్మలు చేసేది. ఇంటి ముందున్న ఇసుక దిబ్బ మీద ఎక్కి దొర్లి పడేది.అలాంటి కిరణ్మయి హైదరాబాద్‌ వచ్చాక మందకొడిగా మారింది. ఆమె తండ్రికి పెద్ద ఉద్యోగం వచ్చి హైదరాబాద్‌ బదిలీ అయింది. అప్పటి నుంచి కిరణ్మయికి కష్టాలు ఆరంభమయ్యాయి. వాళ్ళున్న అంతస్థుల భవనంలో తల్లీ తండ్రీ తప్పించి అన్నీ కొత్తముఖాలే. తోటి పిల్లలతో కలివిడిగా కలిసిపోవాలంటే తెలియని భాషలు అడ్డువచ్చేవి. అయినా నగరంలో పిల్లలకు ఆడుకోవడానికి, మాట్లాడుకోవడానికి తీరికేది? ఉదయం నుంచి ట్యూషన్లు. ట్యూషన్లయిపోగానే స్కూల్‌ బస్‌ వైపు పరుగులు. ఆటోలు వైపు ఉరుకులు. తల్లిదండ్రులు ఇంటికి దగ్గరలో ఉన్న కాన్వెంట్‌లో కిరణ్మయిని చేర్పించారు. అక్కడంతా కొత్తే. అందరూ కొత్తే. యాంత్రికంగా కాన్వెంటుకి వెళ్తుంది.. వస్తుంది.

కాన్వెంట్‌ నుంచి ఇంటికొచ్చాక కిరణ్మయి తల్లితో ఎంతసేపని మాట్లాడుతుంది? తండ్రి ఆఫీస్‌ నుంచి ఇంటికి రాత్రి బాగా పొద్దుపోయాకగాని రాడు. ఆమెకు నాన్నమ్మ, తాత, బాబాయి, ఇరుగుపొరుగు పిల్లలు మాటిమాటికి గుర్తుకొచ్చేవారు. వాళ్ళు గుర్తుకొచ్చేసరికల్లా ఆమె దిగాలుపడిపోయేది. చదువులో కూడా వెనుకబడిపోతున్నట్టు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ తెలియపరిచింది.కిరణ్మయి మందకొడిగా మారిపోతున్నందుకు తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. ఏమిటి చెయ్యడం, ఎలా చెయ్యడం అని వాళ్ళు సతమతమయ్యే సమయంలో వాళ్ళ దూరపుబంధువొకరు ఇంటికి వచ్చారు. అతను నగరంలో టీచరుగా పనిచేస్తున్నాడు. అతని పేరు శాంతారావు. వాళ్ళ మాటల్లో కిరణ్మయి ప్రస్తావన వచ్చింది.
శాంతారావు కిరణ్మయిని దగ్గరకు తీసుకున్నాడు. ఆమెను మాట్లాడించడానికి ప్రయత్నించాడు. ఆమె మాట్లాడలేదు. ఒంటరితనంతో ఆమె బాధపడుతున్నట్టు గ్రహించాడు. అతనికి వెంటనే ఒక ఆలోచన తట్టింది. కొత్తగా నగరానికి వచ్చిన ఆ కుటుంబాన్ని తనింటికి ఆహ్వానించి వెళ్ళిపోయాడు.ఆదివారం వచ్చింది. కిరణ్మయి ఆమె తల్లిదండ్రులు శాంతారావు ఇంటికి వెళ్ళారు. శాంతారావూ అతని భార్యా సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కిరణ్మయి వయస్సుకు ఒకటి రెండేళ్ళు అటూ ఇటుగా ఉండేవారే. ఆ పిల్లలు కొద్దిసేపటిలోనే కిరణ్మయితో స్నేహం చేశారు. కిరణ్మయిని ఇల్లంతా తిప్పారు. ఆ ఇంట్లో ఉన్న రెండు కుక్కపిల్లలు కిరణ్మయిని ఆకట్టుకున్నాయి. ఒకటి తెల్లది నల్లచుక్కలతో ఉంది. మరొకటి నల్లది తెల్లచుక్కలతో ఉంది. కుక్కపిల్లలను ఆ ఇంట్లో పిల్లలు ప్రేమతో సాకడం కిరణ్మయికి నచ్చింది.

ఆ మధ్యాహ్నం అతిథ్యం తీసుకొని కిరణ్మయి ఆమె తల్లిదండ్రులు ఇంటికి బయలుదేరారు. కిరణ్మయి ఆశగా కుక్కపిల్లలకేసి చూడడం శాంతారావు గమనించాడు. కిరణ్మయిలో తాను ఆశించిన మార్పు కనిపించింది. 'కిరణ్మయీ! నీకు ఏ కుక్కపిల్ల కావాలి?' అని అడిగాడు. కిరణ్మయి చప్పున 'తెల్లచుక్కల నల్ల కుక్కపిల్ల!' అని అనేసి తల్లిదండ్రుల వైపు కళ్ళు తిప్పింది వాళ్ళేమంటారో అని! శాంతారావు వెంటనే 'తీసుకొని వెళ్ళు'! అని తెల్లచుక్కల నల్లకుక్కపిల్లను అందించాడు. కిరణ్మయి తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. ఎందుకంటే అప్పటికే శాంతారావు కుక్కపిల్ల గురించి వాళ్ళతో మాట్లాడి ఉన్నాడు. ప్రతివారం కలుసుకుందామని కూడా అనుకున్నారు.శాంతారావు పిల్లలిచ్చిన తెల్లచుక్కల నల్లకుక్కపిల్లను కిరణ్మయి ఆనందంతో అందుకుంది. బాస్కెట్‌లో కుక్కపిల్ల నుంచి కిరణ్మయి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు.
ఆ రోజు నుంచి కిరణ్మయిలో ఒంటరితనం తొంగి చూడలేదు. కాన్వెంటూ, కాన్వెంటు నుంచి ఇంటికి వచ్చాక కుక్కపిల్లతో ఆటలూ పాటలూ, దాని ఆలనాపాలనా...చూడడం.. ఇలా కిరణ్మయికి కాలం చాలలేదు. మునుపటి చురుకు దనం ఇప్పటి కిరణ్మయిలో చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందించారు.


- బెలగాం భీమేశ్వరరావు

No comments:

Post a Comment