Wednesday 12 December 2012

ప్రదీప్‌ నాల్గవ తరగతి చదువుతున్నాడు.


ప్రదీప్‌ నాల్గవ తరగతి చదువుతున్నాడు.వస పిట్టలా ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. బుర్రనిండా సందేహాలే. చుట్టుపక్కల వాళ్ళకు ప్రదీప్‌ను చూస్తే హడల్‌. ఎప్పుడూ ఏ సందేహం అడిగి తమను ఇరకాటంలో పడేస్తాడేమోనని!
ఒకరోజు సాయంత్రం ప్రదీప్‌ తండ్రి కోటీశ్వరరావు వద్దకు చేరాడు. ఆయన పుస్తకం చదువుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి పక్కకు చేరాడు ప్రదీప్‌!
'నాన్నండీ! నాన్నండీ! ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉంటాయి?' మొదటి ప్రశ్న సంధించాడు.
'కోటానుకోట్లు..!' కోటీశ్వరరావు కొడుక్కి సమాధానమిచ్చాడు.
'మరి ఆకాశంలో అన్ని కనిపించలేదు?' ప్రదీప్‌ సందేహం వెలిబుచ్చాడు.
కోటీశ్వరరావు తల గోక్కున్నాడు. అంతలోనే తేరుకొని.. 'ఆకాశం అంతులేనిది. మనకు కనిపించే భాగం కొంచెం మాత్రమే. మనకు కనిపించే భాగంలో నక్షత్రాలు లెక్కిస్తే సుమారు ఎనిమిది వేలుంటాయని శాస్త్రజ్ఞులంటారు..!' అంటూ వివరంగా కొడుకు సందేహం నివృత్తి చేశాడు.
తండ్రి సమాధానం విని ప్రదీప్‌ కాస్సేపు ఆగాడు. ఆ వెంటనే 'ఆ చుక్కలు అందుకోగలమా!' మళ్లీ ప్రశ్న సంధించాడు.
అప్పటికే కోటేశ్వరరావు విసిగిపోయాడు. 'అబ్బ! తలనొప్పి!' భారంగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకొని నటించాడు ప్రదీప్‌ వేస్తున్న ప్రశ్నల నుండి తప్పించుకోడానికి.
ప్రదీప్‌ తాత్కాలికంగా నోరుమూసుకున్నాడు.
తండ్రి ఎంతసేపు కళ్ళు మూసుకొని నటించగలడు? కళ్ళు తెరిచాడు. అది చూసి ప్రదీప్‌ 'నాన్నండీ! తలనొప్పి తగ్గిందా?' ఆప్యాయంగా అడిగాడు. కొడుకు చూపే ప్రేమకు మురిసిపోతూ.. 'ఆ.. తగ్గింది..!' అన్నాడు కోటేశ్వరరావు.
ప్రదీప్‌లో సందేహాలు విజృంభించాయి. వెంటనే 'మరి నక్షత్రాలు మనకెంత దూరంలో ఉంటాయి? మనం అక్కడకు వెళ్ళడానికి ఎంతకాలం పడుతుంది? అక్కడ ఏమి ఉంటాయి? మనలాగ మనుషులక్కడ ఉంటారా? తినడానికి పంటలు పండుతాయా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
కోటీశ్వరరావుకు ఈసారి నిజంగానే తలనొప్పి వచ్చింది. కొడుకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తను చెప్పలేడు. వెంటనే కొడుకుతో 'నేను పెద్దగా చదువుకోలేదు. నీ ప్రశ్నలకు సమాధానాలు మీ పాఠశాలలో చెబుతారు. అవి తెలుసుకోవాలంటే శ్రద్ధగా చదవాలి! నీ సందేహాలను టీచర్లను అడిగి తెలుసుకోవాలి!'' అని మాత్రం చెప్పగలిగాడు.
'అలాగే నాన్నండీ..! అయితే నేను బాగా చదువుకుంటా!' అంటూ తండ్రి బుగ్గపై చటుక్కున ముద్దుపెట్టి, పరుగున వెళ్లిపోయాడు ప్రదీప్‌.్ణ
- బెలగాం భీమేశ్వరరావు

No comments:

Post a Comment