Sunday 30 December 2012

పిసినారి మరణం

చిన్నారి డెస్కు బెలగాం భీమేశ్వరరావు   Sun, 8 Aug 2010, IST
బొండపల్లి గ్రామంలో నారంనాయుడనే రైతుండేవాడు. అతడు పరమలోభి. ఆరుగాలం పొలంలో కష్టపడేవాడు. పండించిన పంటలు పట్నం తీసుకుపోయి అక్కడ వర్తకులకు ఇచ్చేవాడు. వాళ్ళిచ్చే డబ్బు ఇంటికి తీసుకువెళ్తే ఖర్చు కాగలదని వాళ్ళ వద్దే దాచుకొనేవాడు. దాచిన డబ్బుకి, వాడినడబ్బుకి నోటిలెక్కే కానీ రాతా కోతా ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళకన్నా బయటివాళ్ళ మీదే అతనికి నమ్మకం ఎక్కువ. పట్నంలో పని ఆలస్యమయినపుడు కూడా మజ్జిగ నీళ్ళయినా కొనుక్కొని తాగేవాడుకాడు. వర్తకులింటి వద్దే కడుపు నిండా నీళ్ళు తాగేసి ఇంటికి బయలుదేరుతుండే వాడు. నారంనాయుడి పిసినారితనాన్ని చెప్పుకుని వర్తకులు వెనక నవ్వుకొంటుండేవారు.ఒకరోజు నారంనాయుడు జనపనార కట్టలను బండికెక్కించి పట్నం బయలుదేరుతున్నప్పుడు వాళ్ళావిడ, 'ఈసారి డబ్బు షావుకారి వద్ద కుదేయకు. సంక్రాంతి వస్తోంది. అందరికీ కొత్తబట్టలు కొనుక్కురా! పెళ్ళీడు వచ్చిన ఆడపిల్లలున్నారు. నాలుగుచీరలు తీసుకురా' అని చెప్పింది.

ఇల్లాలి మాటలు చెవినపడేసరికి నారంనాయుడికి ఒళ్ళు మండిపోయింది. ఇల్లాలి వంక కరుకుగా చూస్తూ 'మొన్న దసరాకి బట్టలు తీశానుగా. అవి చాలు!' మాట పొడిగించకుండా చరచర బండిని తోలుకుపోయాడు. ఆ చిరాకులో ఆ రోజు తీసికెళ్లాల్సిన చద్దిమూట మరచిపోయాడు. నారంనాయుడి భార్య భర్త నిర్వాకానికి విస్తూపోతూ.. 'ఏం మనిషో ఏమిటో! పొలం రాబడంతా ఎంత పోగుచేసుకుంటాడో ఏమో! ఒక్క రూపాయి కూడా కంట పడనివ్వడు!' అంటూ నోరు నొక్కుకుంది!ఆ రోజు నారంనాయుడు ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. భార్య ఖర్చు చూపేసరికే అతడి మనస్సు గాయపడింది. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదేమో బాగా అలసిపోయాడు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కాళ్ళు తేలిపోతున్నాయి. ప్రాణం విలవిల్లాడిపోతూండగా భార్యను కేకేసి, 'కూడింత తొందరగా పెట్టవే. ఆకలి దంచేస్తుంది!' అని అన్నాడు. భర్త వాలకం చూసి ఆమె గబగబా వంటింట్లోకి వెళ్ళింది. గంజన్నం తెచ్చి భర్త ముందు పెట్టాలని ఆమె చూచేసరికి భర్త నేలమీద పడున్నాడు. గాబరాపడుతూ ఆమె భర్తను తట్టిలేపడానికి ప్రయత్నించింది. ఉలుకూ లేదు. పలుకూ లేదు. అప్పటికీ అతడి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. భార్య గొల్లుమంది. ఇరుగుపొరుగు వాళ్ళు పరుగున వచ్చారు. ఇంట్లో పడున్న నారంనాయుడి శవాన్ని ఇంటి బయటకు తెచ్చారు. ఏడుపులు పూర్తయ్యాయి. జరగవలసిన తంతు జరగాల్సి ఉంది.

అప్పుడు నారంనాయుడి భార్య అక్కడున్న బంధువుల వంక చూసి ''ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు! అంతా పట్నంలోని వర్తకుల వద్దే కుదేసుకున్నాడు!'' అని బోరున ఏడుస్తూ చెప్పింది. బంధువులు వెంటనే పట్నం వెళ్ళారు. వర్తకులను కలిసి విషయం చెప్పారు. నారంనాయుడు దాచుకుంటున్న డబ్బు గురించి అడిగారు. వర్తకులు ''అబ్బే! మా వద్ద నారం నాయుడు డబ్బునెపుడు ఉంచేవాడు కాదు. ఎప్పటిదప్పుడే పట్టుకుపోతుండేవాడు!'' అంటూ మాటమార్చారు.మర్నాడు నారంనాయుడి శవదహన కార్యక్రమానికి ఊళ్ళో వాళ్ళు చందాలేసుకొని కార్యక్రమం ముగించారు.

బెలగాం భీమేశ్వరరావు

ఈనాడు 19 Jun 2012 : రచనలే ఆయన వూపిరి


(19 Jun) పిల్లలకు కథలంటే ఇష్టం.. చిట్టిపొట్టి కథలే వారికి కాలక్షేపం. పిల్లలకు ఆసక్తి కలిగించే రచనలు చేయడం, వాటిద్వారా వారికి కొంత విజ్ఞానం, వినోదం అందించే బాటలో బాలసాహిత్యాన్ని సృజిస్తూ.. విశేషకృషి చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. జిల్లాలో బాలసాహిత్యాన్ని తమ ప్రవృత్తిగా మలచుకున్న వారిలో పార్వతీపురానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో బెలగాం భీమేశ్వరరావు, బెహరా ఉమామహేశ్వరరావును జంట రచయితలుగా ప్రముఖంగా చెప్పుకోవచ్చు.గతంలో గవర్నరు చేతులు మీదుగా బాలసాహిత్యంలో వచ్చిన రచనలు ఆవిష్కరించేందుకు సర్వశిక్షాభియాన్‌ సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా వంద రచనలను ఎంపిక చేయగా.. ఇందులో వీరిద్దరివే.. ఏడు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.సాహిత్యం మేథస్సును పెంచుకొనేందుకు ద్వారంగా ఉపకరిస్తుందని బెలగాం భీమేశ్వరరావు అన్నారు. పసి మనసుల్లో సాహిత్యం ద్వారా విజ్ఞాన బీజాలు వేయడానికి బాలసాహిత్యం చక్కని అవకాశంగా భావించినట్లు ఆయన చెప్పారు. అందుకే పిల్లల కోసం ప్రత్యేకంగా కథలు, పాటలు, గేయాలు రాయడం ప్రవృత్తిగా మలచుకున్నారీయన. ఇప్పటివరకు 500కు పైగా రచనలు చేసిన భీమేశ్వరరావు రచనల్లో 'వజ్రాల గుహ', 'స్వతంత్ర భారతం', 'ఒట్టు కథ', 'కొరివి దెయ్యాలు' వంటి రచనలు ఇటీవల ప్రచురణలు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా ఈయన అవార్డును అందుకున్నారు.కథానికలు రాయడంతో రచనా వ్యాసంగంలోనికి అడుగుపెట్టిన బెహరా ఉమామహేశ్వరరావు ఉపాధ్యాయునిగా తన వృత్తిలో పిల్లలతో ఎక్కువ కాలం గడిపేవారు. వారికి సులువుగా విషయాన్ని తెలియజేసేందుకు చిన్నచిన్న పాటలు, కథలు ద్వారా బోధన చేసేవారు. వీటికే సాహిత్య సృజన ద్వారా రచనలుగా వెలువరించారు. బాలసాహిత్యంలో ఈయన చేసిన కృషికి 'జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా' అవార్డు అందుకున్నారు. ఈయన రచించిన పుస్తకాల్లో 'బడిగంటలు', 'వేమన', 'బహుమతి' కథల పుస్తకాలు వెలువడ్డాయి. ఆరువందలకు పైగా బాలల కథలు, గేయాలు రచించిన ఉమామహేశ్వరరావుకు బాలసాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

Sunday 16 December 2012

ఆలంబం

అమ్మానాన్నల అమ్మనాన్నలు
లాలన చేసే రాగమూర్తులు
ప్రేమను పంచే ప్రేమమూర్తులు
పంచుతారు ఆత్మీయతలు
తాతలు చూపే గారాబాలను
బామ్మ మామ్మల అనురాగాలను
మనమెప్పటికీ మరువలేములే
మన మనసున ఎన్నడు చెరగవులే
చిలిపి పనులకూ సంతసింతురు
అల్లరి చూసీ ఆనందింతురు
సహనం తోడను సంస్కరింతురు
శక్తియుక్తులను ధారపోద్దురు
ఆటలు పాటలు నేర్పిస్తారు
కథలుగాథలు వినిపిస్తారు
మంచీ చెడులను వివరిస్తారు
అనుభవసారం బోధిస్తారు
అమ్మకు నాన్నకు తీరికుండదని
ముద్దూ మురిపెం మనకుండాలని
అమ్మానాన్నల అమ్మనాన్నలు
మనకందరికీ వరమయ్యారు..!
అమ్మానాన్నల అమ్మనాన్నలు
వయోవృద్ధులుగ అయ్యెదరండి!
వారిని ప్రేమగ చూడాలండి!
ఊతకర్రలుగ ఉండాలండి!
- బెలగాం భీమేశ్వరరావు    Sat, 15 Dec 2012, IST  

Thursday 13 December 2012

వింతగుర్రం

రంగులు మార్చే
విచిత్ర గుర్రం!
బాలలందరకు
నచ్చే గుర్రం !!

మబ్బుల లోనా
మసలే గుర్రం!
మనసును ఎరిగీ
ఆగే గుర్రం!!
నదీనదాలు
ఈదే గుర్రం!
కొండలు గుట్టలు
ఎక్కే గుర్రం !!

ఖండ ఖండాలు
చుట్టే గుర్రం!
మహా సముద్రాలు
దాటే గుర్రం !!
శాంతి యాత్రను
జరిపే గుర్రం!
మానవ ఐక్యత
కోరే గుర్రం !!

గుర్రం ! గుర్రం!
రెక్కల గుర్రం!!
మనసు మీటగా
ఎగిరే గుర్రం!

తోడు

కిరణ్మయికి ఐదేళ్ళు. ఫస్ట్‌ స్టాండర్డ్‌ చదువుతుంది. పార్వతీపురంలో ఉన్నప్పుడు చాలా చురుకుగానే ఉండేది. ఇంట్లో బిజీ.. స్కూల్లో బిజీ.. అయినా నాన్నమ్మ ఒడిలో చేరి కథలు చెప్పించుకునేది. తాతగారి కాళ్ళమీద ఊగుతూ కబుర్లు చెప్పించుకునేది. బాబాయి వద్దకు వెళ్ళి అదేమిటి, ఇదేమిటి అని రకరకాల ప్రశ్నలు సంధించేది. నాన్నమ్మ దగ్గితే దగ్గు సిరప్‌ ఇచ్చేది. తాతకి భోజనం కాగానే మందులు అందించేది. సెలవురోజు వచ్చిందంటే ఇరుగుపొరుగు పిల్లలతో రకరకాల ఆటలు ఆడుకునేది. పచ్చిక మీద దొర్లేది. బంకమన్నుతో బొమ్మలు చేసేది. ఇంటి ముందున్న ఇసుక దిబ్బ మీద ఎక్కి దొర్లి పడేది.అలాంటి కిరణ్మయి హైదరాబాద్‌ వచ్చాక మందకొడిగా మారింది. ఆమె తండ్రికి పెద్ద ఉద్యోగం వచ్చి హైదరాబాద్‌ బదిలీ అయింది. అప్పటి నుంచి కిరణ్మయికి కష్టాలు ఆరంభమయ్యాయి. వాళ్ళున్న అంతస్థుల భవనంలో తల్లీ తండ్రీ తప్పించి అన్నీ కొత్తముఖాలే. తోటి పిల్లలతో కలివిడిగా కలిసిపోవాలంటే తెలియని భాషలు అడ్డువచ్చేవి. అయినా నగరంలో పిల్లలకు ఆడుకోవడానికి, మాట్లాడుకోవడానికి తీరికేది? ఉదయం నుంచి ట్యూషన్లు. ట్యూషన్లయిపోగానే స్కూల్‌ బస్‌ వైపు పరుగులు. ఆటోలు వైపు ఉరుకులు. తల్లిదండ్రులు ఇంటికి దగ్గరలో ఉన్న కాన్వెంట్‌లో కిరణ్మయిని చేర్పించారు. అక్కడంతా కొత్తే. అందరూ కొత్తే. యాంత్రికంగా కాన్వెంటుకి వెళ్తుంది.. వస్తుంది.

కాన్వెంట్‌ నుంచి ఇంటికొచ్చాక కిరణ్మయి తల్లితో ఎంతసేపని మాట్లాడుతుంది? తండ్రి ఆఫీస్‌ నుంచి ఇంటికి రాత్రి బాగా పొద్దుపోయాకగాని రాడు. ఆమెకు నాన్నమ్మ, తాత, బాబాయి, ఇరుగుపొరుగు పిల్లలు మాటిమాటికి గుర్తుకొచ్చేవారు. వాళ్ళు గుర్తుకొచ్చేసరికల్లా ఆమె దిగాలుపడిపోయేది. చదువులో కూడా వెనుకబడిపోతున్నట్టు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ తెలియపరిచింది.కిరణ్మయి మందకొడిగా మారిపోతున్నందుకు తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. ఏమిటి చెయ్యడం, ఎలా చెయ్యడం అని వాళ్ళు సతమతమయ్యే సమయంలో వాళ్ళ దూరపుబంధువొకరు ఇంటికి వచ్చారు. అతను నగరంలో టీచరుగా పనిచేస్తున్నాడు. అతని పేరు శాంతారావు. వాళ్ళ మాటల్లో కిరణ్మయి ప్రస్తావన వచ్చింది.
శాంతారావు కిరణ్మయిని దగ్గరకు తీసుకున్నాడు. ఆమెను మాట్లాడించడానికి ప్రయత్నించాడు. ఆమె మాట్లాడలేదు. ఒంటరితనంతో ఆమె బాధపడుతున్నట్టు గ్రహించాడు. అతనికి వెంటనే ఒక ఆలోచన తట్టింది. కొత్తగా నగరానికి వచ్చిన ఆ కుటుంబాన్ని తనింటికి ఆహ్వానించి వెళ్ళిపోయాడు.ఆదివారం వచ్చింది. కిరణ్మయి ఆమె తల్లిదండ్రులు శాంతారావు ఇంటికి వెళ్ళారు. శాంతారావూ అతని భార్యా సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కిరణ్మయి వయస్సుకు ఒకటి రెండేళ్ళు అటూ ఇటుగా ఉండేవారే. ఆ పిల్లలు కొద్దిసేపటిలోనే కిరణ్మయితో స్నేహం చేశారు. కిరణ్మయిని ఇల్లంతా తిప్పారు. ఆ ఇంట్లో ఉన్న రెండు కుక్కపిల్లలు కిరణ్మయిని ఆకట్టుకున్నాయి. ఒకటి తెల్లది నల్లచుక్కలతో ఉంది. మరొకటి నల్లది తెల్లచుక్కలతో ఉంది. కుక్కపిల్లలను ఆ ఇంట్లో పిల్లలు ప్రేమతో సాకడం కిరణ్మయికి నచ్చింది.

ఆ మధ్యాహ్నం అతిథ్యం తీసుకొని కిరణ్మయి ఆమె తల్లిదండ్రులు ఇంటికి బయలుదేరారు. కిరణ్మయి ఆశగా కుక్కపిల్లలకేసి చూడడం శాంతారావు గమనించాడు. కిరణ్మయిలో తాను ఆశించిన మార్పు కనిపించింది. 'కిరణ్మయీ! నీకు ఏ కుక్కపిల్ల కావాలి?' అని అడిగాడు. కిరణ్మయి చప్పున 'తెల్లచుక్కల నల్ల కుక్కపిల్ల!' అని అనేసి తల్లిదండ్రుల వైపు కళ్ళు తిప్పింది వాళ్ళేమంటారో అని! శాంతారావు వెంటనే 'తీసుకొని వెళ్ళు'! అని తెల్లచుక్కల నల్లకుక్కపిల్లను అందించాడు. కిరణ్మయి తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. ఎందుకంటే అప్పటికే శాంతారావు కుక్కపిల్ల గురించి వాళ్ళతో మాట్లాడి ఉన్నాడు. ప్రతివారం కలుసుకుందామని కూడా అనుకున్నారు.శాంతారావు పిల్లలిచ్చిన తెల్లచుక్కల నల్లకుక్కపిల్లను కిరణ్మయి ఆనందంతో అందుకుంది. బాస్కెట్‌లో కుక్కపిల్ల నుంచి కిరణ్మయి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు.
ఆ రోజు నుంచి కిరణ్మయిలో ఒంటరితనం తొంగి చూడలేదు. కాన్వెంటూ, కాన్వెంటు నుంచి ఇంటికి వచ్చాక కుక్కపిల్లతో ఆటలూ పాటలూ, దాని ఆలనాపాలనా...చూడడం.. ఇలా కిరణ్మయికి కాలం చాలలేదు. మునుపటి చురుకు దనం ఇప్పటి కిరణ్మయిలో చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందించారు.


- బెలగాం భీమేశ్వరరావు

మబ్బులు కమ్మిన వేళ

నల్లమబ్బు
కమ్మింది !
చల్లగాలి
వీచింది !!

నెమలి పురిని
విప్పింది !
లేడికూన
గెంతింది !!
పక్షులన్ని
పాడాయి !
పురుగులన్ని
ఎగిరాయి !!

పూల లతలు
నవ్వాయి !
చెట్ల కొమ్మ
లూగాయి !!
నింగి మెఱుపు
మెరిసింది !
నల్లమబ్బు
కరిగింది !!

పుడమి తల్లి
తడిసింది !
పరవశించి
పోయింది !!

Wednesday 12 December 2012

బాలసాహిత్యం వర్క్ షాప్ లో పాల్గొన్నప్పటి ఫోటో


ప్రదీప్‌ నాల్గవ తరగతి చదువుతున్నాడు.


ప్రదీప్‌ నాల్గవ తరగతి చదువుతున్నాడు.వస పిట్టలా ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. బుర్రనిండా సందేహాలే. చుట్టుపక్కల వాళ్ళకు ప్రదీప్‌ను చూస్తే హడల్‌. ఎప్పుడూ ఏ సందేహం అడిగి తమను ఇరకాటంలో పడేస్తాడేమోనని!
ఒకరోజు సాయంత్రం ప్రదీప్‌ తండ్రి కోటీశ్వరరావు వద్దకు చేరాడు. ఆయన పుస్తకం చదువుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి పక్కకు చేరాడు ప్రదీప్‌!
'నాన్నండీ! నాన్నండీ! ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉంటాయి?' మొదటి ప్రశ్న సంధించాడు.
'కోటానుకోట్లు..!' కోటీశ్వరరావు కొడుక్కి సమాధానమిచ్చాడు.
'మరి ఆకాశంలో అన్ని కనిపించలేదు?' ప్రదీప్‌ సందేహం వెలిబుచ్చాడు.
కోటీశ్వరరావు తల గోక్కున్నాడు. అంతలోనే తేరుకొని.. 'ఆకాశం అంతులేనిది. మనకు కనిపించే భాగం కొంచెం మాత్రమే. మనకు కనిపించే భాగంలో నక్షత్రాలు లెక్కిస్తే సుమారు ఎనిమిది వేలుంటాయని శాస్త్రజ్ఞులంటారు..!' అంటూ వివరంగా కొడుకు సందేహం నివృత్తి చేశాడు.
తండ్రి సమాధానం విని ప్రదీప్‌ కాస్సేపు ఆగాడు. ఆ వెంటనే 'ఆ చుక్కలు అందుకోగలమా!' మళ్లీ ప్రశ్న సంధించాడు.
అప్పటికే కోటేశ్వరరావు విసిగిపోయాడు. 'అబ్బ! తలనొప్పి!' భారంగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకొని నటించాడు ప్రదీప్‌ వేస్తున్న ప్రశ్నల నుండి తప్పించుకోడానికి.
ప్రదీప్‌ తాత్కాలికంగా నోరుమూసుకున్నాడు.
తండ్రి ఎంతసేపు కళ్ళు మూసుకొని నటించగలడు? కళ్ళు తెరిచాడు. అది చూసి ప్రదీప్‌ 'నాన్నండీ! తలనొప్పి తగ్గిందా?' ఆప్యాయంగా అడిగాడు. కొడుకు చూపే ప్రేమకు మురిసిపోతూ.. 'ఆ.. తగ్గింది..!' అన్నాడు కోటేశ్వరరావు.
ప్రదీప్‌లో సందేహాలు విజృంభించాయి. వెంటనే 'మరి నక్షత్రాలు మనకెంత దూరంలో ఉంటాయి? మనం అక్కడకు వెళ్ళడానికి ఎంతకాలం పడుతుంది? అక్కడ ఏమి ఉంటాయి? మనలాగ మనుషులక్కడ ఉంటారా? తినడానికి పంటలు పండుతాయా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
కోటీశ్వరరావుకు ఈసారి నిజంగానే తలనొప్పి వచ్చింది. కొడుకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తను చెప్పలేడు. వెంటనే కొడుకుతో 'నేను పెద్దగా చదువుకోలేదు. నీ ప్రశ్నలకు సమాధానాలు మీ పాఠశాలలో చెబుతారు. అవి తెలుసుకోవాలంటే శ్రద్ధగా చదవాలి! నీ సందేహాలను టీచర్లను అడిగి తెలుసుకోవాలి!'' అని మాత్రం చెప్పగలిగాడు.
'అలాగే నాన్నండీ..! అయితే నేను బాగా చదువుకుంటా!' అంటూ తండ్రి బుగ్గపై చటుక్కున ముద్దుపెట్టి, పరుగున వెళ్లిపోయాడు ప్రదీప్‌.్ణ
- బెలగాం భీమేశ్వరరావు