Sunday 30 December 2012

ఈనాడు 19 Jun 2012 : రచనలే ఆయన వూపిరి


(19 Jun) పిల్లలకు కథలంటే ఇష్టం.. చిట్టిపొట్టి కథలే వారికి కాలక్షేపం. పిల్లలకు ఆసక్తి కలిగించే రచనలు చేయడం, వాటిద్వారా వారికి కొంత విజ్ఞానం, వినోదం అందించే బాటలో బాలసాహిత్యాన్ని సృజిస్తూ.. విశేషకృషి చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. జిల్లాలో బాలసాహిత్యాన్ని తమ ప్రవృత్తిగా మలచుకున్న వారిలో పార్వతీపురానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో బెలగాం భీమేశ్వరరావు, బెహరా ఉమామహేశ్వరరావును జంట రచయితలుగా ప్రముఖంగా చెప్పుకోవచ్చు.గతంలో గవర్నరు చేతులు మీదుగా బాలసాహిత్యంలో వచ్చిన రచనలు ఆవిష్కరించేందుకు సర్వశిక్షాభియాన్‌ సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా వంద రచనలను ఎంపిక చేయగా.. ఇందులో వీరిద్దరివే.. ఏడు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.సాహిత్యం మేథస్సును పెంచుకొనేందుకు ద్వారంగా ఉపకరిస్తుందని బెలగాం భీమేశ్వరరావు అన్నారు. పసి మనసుల్లో సాహిత్యం ద్వారా విజ్ఞాన బీజాలు వేయడానికి బాలసాహిత్యం చక్కని అవకాశంగా భావించినట్లు ఆయన చెప్పారు. అందుకే పిల్లల కోసం ప్రత్యేకంగా కథలు, పాటలు, గేయాలు రాయడం ప్రవృత్తిగా మలచుకున్నారీయన. ఇప్పటివరకు 500కు పైగా రచనలు చేసిన భీమేశ్వరరావు రచనల్లో 'వజ్రాల గుహ', 'స్వతంత్ర భారతం', 'ఒట్టు కథ', 'కొరివి దెయ్యాలు' వంటి రచనలు ఇటీవల ప్రచురణలు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా ఈయన అవార్డును అందుకున్నారు.కథానికలు రాయడంతో రచనా వ్యాసంగంలోనికి అడుగుపెట్టిన బెహరా ఉమామహేశ్వరరావు ఉపాధ్యాయునిగా తన వృత్తిలో పిల్లలతో ఎక్కువ కాలం గడిపేవారు. వారికి సులువుగా విషయాన్ని తెలియజేసేందుకు చిన్నచిన్న పాటలు, కథలు ద్వారా బోధన చేసేవారు. వీటికే సాహిత్య సృజన ద్వారా రచనలుగా వెలువరించారు. బాలసాహిత్యంలో ఈయన చేసిన కృషికి 'జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా' అవార్డు అందుకున్నారు. ఈయన రచించిన పుస్తకాల్లో 'బడిగంటలు', 'వేమన', 'బహుమతి' కథల పుస్తకాలు వెలువడ్డాయి. ఆరువందలకు పైగా బాలల కథలు, గేయాలు రచించిన ఉమామహేశ్వరరావుకు బాలసాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

No comments:

Post a Comment